

వరద నీటిలో చిన్న గుడిసెను ఆశ్రయంగా చేసుకొని రెండు వారాలు గడిపిన మహిళ
బక్సర్, సెప్టెంబర్ 16: గంగా నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 55 ఏళ్ల మహిళ 15 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడింది. బిహార్‌లోని బక్సర్ జిల్లా కపూర్పట్టి గ్రామానికి చెందిన సునయినా దేవి ఆగస్టు 30న గంగానదిలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ప్రవాహం ఉధృతమై ఆమెను ఈడ్చుకెళ్లింది.
ప్రవాహంలో సుమారు 50 కిలోమీటర్లు కొట్టుకుపోయిన ఆమె ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా చైన్చాప్రా గ్రామ సమీపంలోకి చేరుకుంది. అక్కడ వరద నీటితో చుట్టుముట్టిన పొలంలోని ఓ చిన్న గుడిసె ఆమెకు కనిపించింది. వెంటనే ఆ గుడిసెను ఆసరాగా చేసుకుని ప్రాణాలను కాపాడుకుంది. అయితే చుట్టూ వరద నీరు ఉండటంతో అక్కడి నుంచి బయటకు రావడం ఆమెకు సాధ్యం కాలేదు.
గంగాజలమే ఆధారం
చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో సునయనా దేవి అక్కడే చిక్కుకుపోయింది. తినడానికి ఆహారం లేకపోయినా గంగానది నీటినే తాగుతూ సుమారు రెండు వారాల పాటు గుడిసెలో గడిపినట్లు పోలీసులకు తెలిపింది.
ఇదిలా ఉండగా, కుటుంబ సభ్యులు ఆమె కోసం బక్సర్‌లో వెతుకుతూనే ఉన్నారు. ఆమె వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఉత్తరప్రదేశ్ వరకు చేరుకున్న విషయం వారికి తెలియలేదు.
వరద నీరు క్రమంగా తగ్గడంతో సోమవారం గుడిసె నుంచి బయటకు వచ్చేందుకు సునయనా దేవి ప్రయత్నించింది. అయితే లోతైన నీటిలో చిక్కుకోవడంతో మరోసారి ప్రమాదంలో పడింది. దీంతో సహాయం కోసం గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో ఆమె “శివగురు.. శివగురు” అంటూ పిలిచినట్లు అధికారులు తెలిపారు.
కేకలు విన్న మత్స్యకారులు
సునయనా దేవి అరుపులు సమీపంలో చేపలు పడుతున్న మల్లాహ్ మత్స్యకారులకు వినిపించాయి. వెంటనే వారు పడవలో అక్కడికి చేరుకుని ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆమెను హల్దీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు ఆమె వివరాలను సేకరించి బక్సర్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సునయనా దేవిని చూసి భావోద్వేగానికి గురయ్యారు.
దాదాపు రెండు వారాల పాటు కనిపించకుండా పోయిన ఆమె ప్రాణాలతో తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. అనంతరం ఆమెను బక్సర్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఎక్కువ రోజుల పాటు సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఆమె బలహీనంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉధృతమైన గంగా ప్రవాహంలో కొట్టుకుపోయి.. వరద నీటితో చుట్టుముట్టిన గుడిసెను ఆశ్రయంగా చేసుకుని దాదాపు 15 రోజులు గడిపి.. చివరకు మత్స్యకారుల సాయంతో ప్రాణాలతో బయటపడిన సునయనా దేవి ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.